Meena Rasi 2026-2027 Telugu Rasi Phalalu Yearly Horoscope

Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Meena Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.

మీనరాశి 2026-2027 Rasi Phalalu Banner
పూర్వాభాద్ర (4), ఉత్తరాభాద్ర (4), రేవతి (4) పాదాలు.
💰 ఆదాయం: 14, 💸 వ్యయం: 11, 👑 రాజ్యపూజ్యం: 7,🚫 అవమానం: 2

శ్రీ పరాభవ నామ సంవత్సరము నందు మీనరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుండగలదు. ఏలినాటి శని ప్రభావము కొనసాగును. శారీరక రుగ్మతలు ఒకేసారి దాడి చేసినట్లు ఉండును. మనోధైర్యము కోల్పోవుదురు. మతిస్థిమితము తగ్గును. తేజోహీనము ద్రవ్యనాశనము కలుగును. తరచూ దేశాంతర వాసము వృధా సంచారము వృధా ప్రయాణములతో ధ్రవ్య నాశనము కలుగును. మతిభ్రంశముతో ఇంటినుండి వెడలిపోవుట, ప్రయాణములలో తప్పిపోవుట కలుగును. హృదయ వ్యాధితో బాధపడుదురు. బంధువైరము కలుగును. స్థిర చరాస్తులు కోల్పోవుదురు. చట్టపరమైన సమస్యలలో ఇరుక్కొని అగమ్యగోచరముగా నుండును. శత్రువుల దుష్పచారము లతో సంఘ గౌరవము తగ్గును. పదవీ త్యాగము ఉండును. దుర్వ్యసనములకు లోనగుదురు. ఇష్ట బంధుమిత్రాదులు దూరమయ్యేదరు. ఆప్తమిత్రులకు హాని కలుగును. అప్ప్పుల బాధ కృశింప చేయును. యాచనము కలుగును. అనవసర వివాదములతో బంధనము కలుగును. మధ్య మధ్య కొంత ఉపశనము వాతావరణము నుండును. ద్రవ్య లాభము కలుగును. చేయు వృత్తి వ్యాపార కృషి వాణిజ్య ఉద్యోగాదుల యందు వ్యతిరేకత ఉన్ననూ నెగ్గుకొచ్చెదరు. సమస్యల చట్రం నుండి బయట పడి ఊరట చెందెదరు. బంధు సౌఖ్యము కలుగును. అపరిమిత ధన వ్యయము ఉండగలదు. ప్రతి పని 1కి 10సార్లు ప్రయత్నము చేసిన మీదట పనులు పూర్తి అగును. బార్య భర్తల మధ్య సఖ్యత తగ్గును. అగ్నిభయము అగ్ని ప్రమాదములు కలుగును. పశు గో లాభము కలగును. మనోధైర్యము పెరుగును.

2026-2027 మీనరాశికి సంవత్సర ప్రారంభమున సర్వవిషయముల యందు మందగమనము కలుగును. దేశాంతర ప్రయాణములు చేయుదురు. ఆర్ధిక నష్టములతో అవకాశములు రాక ఇబ్బంది పడుదురు. శరీరము నందు నీరసము నిస్సత్తువ ఆవహించును. పనివారలతో కలహములు కలుగును. ఋణబాదలు హెచ్చును. బుద్ధి చాంచల్యముతో వృధా సంచారము చేసెదరు. ఇచ్చిన మాట నిలుపుకొనలేక పోవుటచే ఆర్ధిక సర్ధుబాట్లు జరగక సమస్యలు కలుగును. కోర్టు నోటీసులు అందుకొందురు. బంధుమిత్రాదులు సమయానికి అక్కరకు రాక అవమానముల పాలు చేసేదరు. కొత్త సమస్యలు చుట్టుముట్టును. తక్కువ వారితో మాటలు పడవలసి వచ్చును. యాచనము, బంధన ప్రాప్తి కలుగును. ప్రమాదములు ఆపరేషన్లుతో తేజస్సు నశించును. స్థిర చరాస్తులకు కాళ్ళు వచ్చును. దాయాదులతో కలహములు కలుగును. దొంగల భయము కలుగును. స్థాన భ్రంశముల స్థాన నాశనము దేశ త్యాగము కలుగును.

2026-2027 మీనరాశికి సంవత్సర ద్వితయ భాగమున కొంత ఊరట కలుగును. సమస్యల నుండి బయట పడి ఉత్సాహముగా నుందురు. ఆరోగ్యము సహకరించును. ద్రవ్య లాభము కలుగును. కొన్ని ప్రయత్నములు బంధు మిత్ర సహకారముతో ఆలస్యము మీద నెరవేరును. ఋణములు మంజూరు అగును. ఇంటియందు ఆగిపోయిన శుభకార్యాది కార్యములు తిరిగి ప్రారంభమగును. శత్రుబాధ తగ్గును. ఋణ ద్రవ్యము లభించుటతో ఊపిరి పీల్చుకొందురు. పోలీసు కోర్టు కేసుýలో రాజీ ధోరణి అవలంబించెదరు. శత్రువులపైరాజకీయముగా పైచేయి సాధించెదరు. ప్రభుత్వ పెద్దల సహకారము లభించగలదు. భార్య భర్తల మధ్య సమస్యలు పరిష్కారమగును. చేయు వృత్తి వ్యాపార కృషి వాణిజ్య ఉద్యోగాదుల యందు సహచరులతో సమస్యలు కొలిక్కి వచ్చును. అభిప్రాయ బేధములు సమసి పోయి ఆనందముగా నుందురు. భూగృహ నిర్మాణాది కార్యలాభము కలుగును. సౌఖ్యముతో నుందురు. అమర్యాదలు, అపవాదములు తొలగిపోవును. ప్రయాణములు సిద్దించును. పుణ్యక్షేత్ర సందర్శనము గురుదేవతా దర్శనములు చేయుదురు. స్థిరచరాస్తులు విషయములో స్పష్టత కలుగును. దాయాదులు దారికి వచ్చెదరు. మాట పట్టింపులు తొలగి సర్వులతో సఖ్యతతో నుందురు.

2026-2027 మీనరాశికి సంవత్సర తృతీయ భాగమున ఆరోగ్యము మందగమనముతో నుండను. తరచూ వైద్యశాలా దర్శనము, ఔషద సేవనము చేయవలసి వచ్చును. శారీరక సౌఖ్యము తగ్గును. కష్టించి చేసిన పనికి తగిన ప్రతిఫలము రాకుండుటచే ఇబ్బందులు కలుగును. శరీర ఆరోగ్య విషయములో దేశ విదేశ ప్రయాణములు చేయవలసి వచ్చును. మానసికముగా స్థిరత్వము తగ్గును. మతిభ్రంశముతో చేసిన పని చేయుట తిరిగినచోట తిరుగుట చేయుదురు. శత్రువులు బాధించెదరు. బంధుమిత్రాదులతో కొత్త సమస్యలు కలుగును. భార్యభర్తల మధ్య పొరపొచ్చములు కలుగును. పోలీసు కోర్టు సమస్యలు, జరిమానాలు నోటీసులు అందుకొందురు పుత్ర కలహము బంధు కలహము జరుగును. దుర్వ్యసనములకు అలవాటుపడి పెద్ద మొత్తములో సోమ్ము పోగొట్టుకొందురు. ప్రభుత్వ అధికారులతో మాట పట్టింపులు కలుగును. అభివృద్ధి కానరాకుండును. ద్రవ్యనాశనము కలుగును. ఋణభారము పెరిగిపోవును. కాలిన గాయములు, వాహనప్రమాదములు కలగును. సమస్యల వలయములో చిక్కుకొందురు.

2026-2027 మీనరాశికి సంవత్సరాంతమున తిరిగి అన్ని విధములా పుంజుకొని ముందుకు వెళ్ళెదరు. శక్తి వంచన లేకుండా కృషి చేసి సమస్యలను కొలిక్కి తెచ్చెదరు. ఆరోగ్యము అనుకూలించును, మధ్యవర్తుల సహకారముతో శత్రువులు మిన్నకుండిపోయేదరు. బంధుమిత్రాదుల సహకారము లభించును. ఆదాయము పెరుగును. కుటుంబ జీవనసౌఖ్యముల కలుగును. ఇంటియందు సమస్యలను నివారించి సఖ్యత చేసుకొందురు. కొన్ని ఋణములు తీరిపోవును. నూతనవస్తు వాహనములు సమకూర్చుకొందురు. భూ గృహ నిర్మాణాది కార్యములు తిరిగి ప్రారంభించి కొనసాగించెదరు. సజ్జన గోష్టితో దుర్వ్యసన భారినుండి బయట పడి అభివృద్ధి దిశగా అడుగులు వేయుదురు. సర్వకార్యముల యందు కార్యోన్ముఖులై ముందుకు సాగెదరు. బంధుమిత్ర సౌఖ్యము కలుగును. పోలీసు కోర్టుకేసులు ఉపశమించును. సంఘ గౌరవము పెరుగును. సంతాన సమస్యలు తొలగి సంతానవృద్ధి కలుగును. సకల కార్యసిద్ధితో ఆనందముగా నుందురు. చేయు వృత్తి వ్యాపార కృషి వాణిజ్య ఉద్యోగాదుల యందు లాభార్జన కలుగును. సర్వుల సహకారము లభించును. ప్రభుత్వ పెద్దలతో సఖ్యత కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనములు చేసెదరు. మంత్రసిద్ధి మృష్టాన్న భోజన ప్రాప్తి కలుగును.

విద్యార్దులకు పరిక్షా కాలము మందబుద్ధి కలుగును. ఫెల్యూర్స్ కలుగును. ర్యాంకులు తప్పిపోవును. అత్తెసరు మార్కులతో గట్టెక్కెదరు. అనారోగ్యము ఆటంకములు కలిగించును. అవార్డులు రివార్డులు తృటిలో తప్పిపోవును.

నిరుద్యోగులు నిరాశ కలుగును. చేసిన ప్రయత్నములు నిష్పలమగును. మరికొంత కాలము వేచిఉండక తప్పదు. చిన్న ఉద్యోగములతో సరిపెట్టుకొనవలసి వచ్చును.

ఉద్యోగులకు విశ్రాంతి లేకుండును. అధికారులను మెప్పించుట కష్టసాధ్యమగును. అకారణ కలహములతో సహచరులతో విద్వేషములు కలుగును. అకారణ బదిలీలు సస్పెన్షన్లు ఎదుర్కొందురు. ప్రమోషన్లు ఆగిపోవును.

వ్యాపారులకు కష్టకాలము ఆదాయ వ్యయముల మధ్య పొంతన లేకుండును.స్థానభ్రంశము, స్థాన నాశనము కలుగును.

కార్మికులకు అనవసర కార్యములు మీద పడును. శ్రమ కాఠిన్యము పెరుగును. చేసిన పనికి గుర్తింపు లభించదు. అన్ని విషయముల యందు వ్యతిరేకత వ్యక్తమగును.

వ్యవసాయదారులకు ప్రకృతి వైపరీత్యములతో నష్టములు ఎదురగును. చీడపీడల సమస్యలతో పంట రాకుండును. పెట్టుబడులు రాకపోవుటచే ఋణములు చేయవలసి వచ్చును.

ఆక్వాకల్చర్ ఆర్ధిక నష్టములతో సమస్యలు ఎదురగును. సాగు చేయకుండుట మంచిది. ఋణములు తీర్చుటకు శక్తి చాలకుండును.

కవులు, కళాకారులు సరియైన పనిలేక అలమటించెదరు. నిరాశాకాలము. ప్రజా గుర్తింపు లేక ఇబ్బందులు పడుదురు. ఉన్న పని సానుకూలముగా చేయలేక అవమానములు పాలు అగుదురు.

సినిమారంగము స్థిరత్వము లేకుండును. దుర్వ్యసనములకు లోనగుదురు. దుష్ట సహవాసముతో ఆర్ధిక నష్టములు కలుగును. అప్రతిష్ట అపభ్రంశము కలుగును.

రాజకీయ నాయకులకు ప్రజా ప్రభుత్వ మద్దతు కోల్పోవుదురు. పదవీ త్యాగం కలుగును. అనవసర వాఖ్యలతో సమస్యలు కొనితెచ్చుకొందురు. కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుదురు. పై నుండి సరియైన మద్దతు లేక రాజకీయ సన్యాసం చేయవలసి వచ్చును.

NRIలకు పూర్తి వ్యతిరేకత కలుగును. ఉద్యోగభంగములు. స్పెక్యులేషన్ లాభించదు.

2026-2027 మీనరాశి: గ్రహశాంతి, అదృష్టసంఖ్య, అదృష్ట రత్నం & రుద్రాక్షధారణం

🙏 గ్రహశాంతి

శని, గురు, కుజ, రాహు, కేతు, రవి గ్రహశాంతులు ఆచరించవలెను నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.

🔢 అదృష్టసంఖ్య
3

1, 2, 4, 7, 9 మిత్ర సంఖ్యలు. ప్రతినెలా 3, 12, 21, 30 తేదీలు ఆది, సోమ, గురువారములు కలిసిన మరింత శుభము.

💎 అదృష్ట రత్నం

పూర్వాభాద్ర-పుష్యరాగం, ఉత్తరాభాద్ర-నీలం, రేవతి-పచ్చ.

📿 రుద్రాక్షధారణం

త్రిముఖి, సప్తముఖి, ద్వాదశముఖి, షష్టదశముఖి శుభము.

Meena Rasi Phalalu 2026-2027 PDF Download

Get the high-resolution PDF - Meena 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.


Rasi Phalalu 2026-2027 Copyrights: “BrahmaSri Pedagadi Mohana Ravishankar Daivagna”, Mobile: 9949598627. Read Disclaimer

ముఖ్య సూచన: ఈ మీన రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.

» Telugu Festivals 2026 (IST)