Vrushaba Rasi 2026-2027 Telugu Rasi Phalalu Yearly Horoscope

Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Vrushaba Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.

వృషభరాశి 2026-2027 Rasi Phalalu Banner
కృత్తిక (2, 3, 4), రోహిణి (4), మృగశిర (1, 2) పాదాలు.
💰 ఆదాయం: 5, 💸 వ్యయం: 14, 👑 రాజ్యపూజ్యం: 5,🚫 అవమానం: 4

శ్రీ పరాభవనామ సంవత్సరము నందు వృషభరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభాధిక మిశ్రమ ఫలములతో అత్యంత ఉత్సాహవంతముగా నుండును. అప్రయత్నకార్యసిద్ధి, అప్రయత్న ధనలాభముతో ముందుకు సాగగలరు. సరస సల్లాపకేళీ వినోదములతో ఆనందముగా నుండగలరు. ఇంటియందు వివాహాది శుభకార్యములు సత్వరమే నెరవేరగలవు. భూ గృహ నిర్మాణాది కార్యములు అప్రయత్నముగా ఫలించగలవు. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదులయందు అభివృద్ధి కలుగును. ఆరోగ్యము చేకూరును. మనోభీష్టములన్నియూ నెరవేరగలవు. శారీరక, మానసికముగా దృఢముగా నుందురు. ఋణములు తీరిపోవును. నూతన పశుక్షేత్రాభివృద్ధి కలుగును. భార్య/భర్త సంతానముల మధ్య అనురాగము వికసించి ఆనందోత్సాహములతో నుందురు. శతృపీడ తొలగిపోవును. మిత్రలాభము చేకూరును. వ్యతిరేక వర్గము మీతో రాజీకి వచ్చి కలసిపోవుదురు. తలచినదే తడవుగా కార్యసిద్ధి కలుగును. పుణ్యతీర్థ గమనము చేయుదురు. నూతన రాజకీయ పదవీయోగము కలుగును. విదేశీగమనము చేయగలరు. సంఘగౌరవము పెరుగును.సన్మాన సత్కారములు స్వీకరించగలరు. అఖండ రాజయోగము లభించును. అధికారుల ప్రోత్సాహము లభించును. నూతన దేవాలయ తటాక నిర్మాణాది కార్యములు చేయగలరు. మధ్య మధ్య కొన్ని ఇబ్బందులు కలిగిన వాటిని విజయవంతముగా నిరోధించి ముందుకు సాగగలరు.

2026-2027 వృషభరాశికి సంవత్సర ప్రధమ భాగమున హృదయ సుఖము, యశోవృద్ధి, సౌభాగ్యము దనాదాయము కలుగును. సంఘ గౌరవము పెరుగును. మీపైఅధికారులు మీ మాట శిరోధార్యముగా భావించి మీకు అనుకూలింతురు. నూతన వస్త్ర, వస్తు, వాహనములు సమకూర్చుకొందురు. తీర్థయాత్రాగమనము, దైవదర్శనములు చేయగలరు. బంధుమిత్రాదులతో అత్యంత సంతోషముగా నుందురు. ధర్మకార్యములు చేయుదురు. అన్నదాన విభవము కలుగును. ఆరోగ్యము కలుగును. పోలీసు కోర్టుకేసుల యందు అనుకూలతలు కలుగును. ఆగిపోయిన కార్యములు సత్వరము పూర్తి అగును.

2026-2027 వృషభరాశికి సంవత్సర ద్వితీయ భాగమున శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగును. ధైర్యము సడలును. ప్రకృతి వైపరీత్యములతో వ్యవసాయాది కార్యములకు భంగము కలుగును. ఆర్ధిక వనరులు క్షీణించును. శత్రుబాధ కలుగును. నరఘోషతో సర్వులు కంటగింపుగా నుందురు. అవమానములు ఎదుర్కొనవలసి వచ్చును. ఇంటియందు అభిప్రాయ బేధములు కలుగును. చెడు స్నేహములతో దారి తీయను. బంధువైరము కలిగి స్థిరాస్తులు వివాదములో పడును. అయినను గ్రహ బలముచే ముందుకు సాగగలరు. సమయమునకు తగిన విధముగా ప్రవర్తించి ప్రమాదములనుండి బయట పడగలరు.

2026-2027 వృషభరాశికి సంవత్సర తృతీయ భాగమునందు కొంత అసంతృప్తి కలుగును. బుద్ధి చాంచల్యము కలుగును. అనవసర వివాదములలలో వేలు పెట్టుటచే సమస్యలు కొనితెచ్చుకొందురు. బ్యాంకు లావాదేవీల యందు మోసమునకు గురి అగుదురు. ష్యూరిటీల విషయములో పాత కేసులు ఇబ్బంది పెట్టును. దృష్ట సాంగత్యము కలుగును. దుర్వ్యము కలుగును. బార్య/భర్త సంతానముల మధ్య అభిప్రాయ బేధములు పొడచూపును. సంఘ గౌరవము తగ్గును. హఠాత్పరిణామములో ఆర్థిక నష్టములు కలుగును. పదవీత్యాగము చేయవలసి వచ్చును. మనోధైర్యము సడలును. బంధు మిత్ర వైరములతో చికాకులు కలుగును. దూరదేశ ప్రయాణ వ్యాపారాదుల యందు నష్టములు సంభవించును. దురాశ దుఃఖమునకు చేటు వలె నుండును. అభివృద్ధి కార్యక్రమములు కుంటు పడును. స్థిరచరాస్తులు జప్తునకు గురి అగు సూచనలున్నవి. అలసట, ఆరోగ్యక్షీణము కలుగుటచే సమస్యలు కలుగును. అయిననూ ధైర్యము వహించి ముందుకు సాగగలరు. ప్రమాదముల నుండి బయట పడగలరు.

2026-2027 వృషభరాశికి సంవత్సరాంతమున పునర్ వైభవముతో ముందుకు సాగగలరు. పరిస్థితులన్నియూ సానుకూలమగును. వ్యతిరేకులు అనుకూలురుగా మారిపోయేదరు. ఆరోగ్యము కుదుట పడును. సమస్యలన్నియూ పరిష్కరించబడి ఆనందముగా నుందురు. అభివృద్ధి పదములో ప్రయాణించెదరు. సానుకూల నిర్ణయములతో సుఖ సౌఖ్యములు పొందగలరు. భార్య/భర్త సంతాన సమస్యలు కొలిక్కి వచ్చును. సయోధ్య చేకూరి సామరస్యత కలుగును. శత్రుపీడ, ఋణపీడ తొలగిపోవును. నూతన స్థిరచరాస్తులు సమకూర్చుకొందురు. ఆగిపోయిన, వాయిదా పడిని పనులు తిరిగి ప్రారంభమగును. సర్వులు మీకు అనుకూలరు అగుటచే సమస్యల నుండి బయటపడుదురు. పోలీసు, కోర్టు కేసులు పూర్తిగా తొలగిపోవును. రాజకీయ గౌరవము కలిగి నూతన రాజకీయ పదవులు పొందగలరు. ద్రవ్య లాభము కలుగును. ఇష్టార్ధ సిద్ధి పొందుదురు. పుణ్య తీర్థ గమనము, గురు దేవతా దర్శనము చేయుదురు. శుభకార్య నిర్వహణ సత్వరము నెరవేరును. మనోభీష్టములు పూర్తిగా సాధించుకొందురు. మనః స్సంతోషముతో కర్మసిద్ది కలుగును. అప్రయత్నముగా దూరపు బంధువులతో సఖ్యత కలిగి నూతన కార్యములను సాధించుకొందురు. విదేశీ గమనము అనుకూలించును. ఇంటియందు నూతన వస్తు, వాహన, ఆభరాణాదులు సమకూర్చుకొందురు. మధుకరమైన ప్రీతి వస్తువులతో కూడిన ఇష్టాన్న భోజనము సమకూరును. ఇంటి యందు మంగళ వాయిద్యములతో కూడిన శుభకార్య నిర్వహణ చేయుదురు. ధర్మ కార్యములు చేయుదురు. చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల యందు లాభములనార్జించ గలరు.

విద్యార్ధులకు అత్యంత అనుకూల కాలము. పరీక్షలలో చదివిన అంశములు రావడంతో ఉత్సాహంగా నుండును. మంచి మార్కులు సాధించెదరు. అవార్డులు, రివార్డులు పొందెదరు. స్టేట్/నేషనల్ ర్యాంకులు సాధించడంలో విజయం సాధించి గుర్తింపు తెచ్చుకొనగలరు.

నిరుద్యోగులకు ఆశలు చిగురించి అనుకున్న ఉద్యోగములు సాధించగలరు. ప్రఖ్యాత సంస్థలలో అనూహ్యముగా స్థానం సంపాదించెదరు. మంచి ప్యాకేజీలు పొంది ఉత్సాహముగా నుందురు. విదేశీ ఉద్యోగములు సాధించెదరు. సివిల్ సర్వీస్ ఉద్యోగార్ధులకు అనుకూల కాలము.

ఉద్యోగులు పాడింది పాట, ఆడింది ఆటగా నుండును. పై అధికారులు గుర్తింపు పొంది రాణించెదరు. ప్రమోషన్లు అలవోకగా సాధించగలరు. గుర్తింపు ఉన్న అనుకూల స్థానములకు బదిలీలు పొందుటలో విజయం సాధించగలరు. అందరిలో గుర్తింపు పొంది అభివృద్ధి పధంలో నడిచెదరు. నూతన ఆదాయ మార్గములు విస్తరించును. పాత కేసులు తొలగిపోవును.

వ్యాపారులకు మిశ్రమ కాలము ధనాదాయము బాగుండును. నూతన ఆదాయ మార్గములు ఏర్పాటు చేసుకొనుటలో సఫలీకృతులగుదురు. బ్యాంక్‌ల లోన్లు పొంది వ్యాపార విస్తరణకు అనుకూల కాలము. నూతన పెట్టబడులు పెట్టుదురు. వ్యాపార అనుమతులు సులభంగా పొందగలరు.

కార్మికులకు అత్యంత విలువైన కాలము. శ్రమకు తగిన గుర్తింపులభించును. శ్రమ కాఠిన్యము తొలగిపోవును. పై అధికారుల మెప్ప్పు పొందగలరు. నూతన ఆదాయ మార్గములు విస్తరించును. వస్తు, వాహనములు సమకూర్చుకొనగలరు. ఆరోగ్యము చేకూరును.

వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితము కలుగును. చీడపీడల భయము తొలగిపోవును. ప్రకృతి సహరించును. మంచి పంటలు పండును. ఇంటి యందు శుభకార్యములు చేయుదురు. పశు, క్షేత్ర వృద్ధి కలుగును. ఆరోగ్యము చేకూరును.

ఆక్వాకల్చర్ రైతులకు అనుకూల కాలము దిగుబడి పెరుగును. ధనవృద్ధి కలుగును.అనుకూల ఫలితములు ఉండును. నూతన సాంకేతిక పనిముట్లు సమకూర్చుకుందురు. సంఘ గౌరవము పెరుగును. ఆదాయం పెరుగును.

కవులు, కళాకారులు అత్యంత శుభదాయకమైన కాలము. ప్రభుత్వ గుర్తింపు లభించును. ప్రజా స్పందనతో గౌరవము లభించును. సన్మాన సత్కారములు, గుర్తింపు పొందగలరు.

సినిమారంగము వారికి పురోగతి లభించును. నూతన ప్రాజెక్టులు పట్టాలెక్కును. హిట్‌లు సాధించెదరు. అవార్డులు, రివార్డులుతో జాతీయ అంతర్జాతీయ గుర్తింపు లభించును.

రాజకీయ నాయకులకు ఆదరణ పెరుగును ప్రజా, ప్రభుత్వ గుర్తింపు పొంది నూతన రాజకీయ పదవీయోగం సాధించెదరు. గౌరవ మర్యాదలు పెరుగును. ప్రజా మద్దతు లభించును.

NRIలకు అనుకూల కాలము ఇంటా, బయట గుర్తింపు, గౌరవము పొంది ఆర్ధికముగా బలపడెదరు. విదేశీఛాన్సులు సత్వరము లభించును. స్పెక్యులేషన్ లాభించును.

2026-2027 వృషభరాశి: గ్రహశాంతి, అదృష్టసంఖ్య, అదృష్ట రత్నం & రుద్రాక్షధారణం

🙏 గ్రహశాంతి

ఈసంవత్సరమంతయూ రవి, బుధ, గురు, రాహు, కేతు గ్రహశాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి

🔢 అదృష్టసంఖ్య
6

6, 15, 24 తేదీలు శుక్రవారం శుభం. 5, 8 తేదీలు బుధవారం, శనివారం కలిపిన మరింత యోగప్రదం.

💎 అదృష్ట రత్నం

కృత్తిక-కెంపు, రోహణి-ముత్యం, మృగశిర-పగడం ధరించవలయును.

📿 రుద్రాక్షధారణం

పంచముఖి, చతుర్ధశముఖి, ఏకవింశతి ముఖి (5, 14, 21 ముఖాలు).

Vrushaba Rasi Phalalu 2026-2027 PDF Download

Get the high-resolution PDF - Vrushaba 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.


Rasi Phalalu 2026-2027 Copyrights: “BrahmaSri Pedagadi Mohana Ravishankar Daivagna”, Mobile: 9949598627. Read Disclaimer

ముఖ్య సూచన: ఈ వృషభ రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.

» Telugu Festivals 2026 (IST)